నాణ్యమైన వైద్య సేవలందించాలి.. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: ప్రభుత్వాస్పత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సత్వర వైద్య సేవలందించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి (MLA Alleti) మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవల తీరును సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు.

రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సిటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడం, ఎక్స్‌రే సమస్యలు ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌ను ఆదేశించారు. ప్రతిరోజూ ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించడంతోపాటు రోగులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 25 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనం పూర్తయిందని, ప్రారంభోత్సవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను అసెంబ్లీ ప్రస్తావించి, అధిక నిధులు తెచ్చేవిధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>