అక్రమ లింగ నిర్ధారణ.. ల్యాబ్ టెక్నీషియన్ అరెస్ట్

కలం, జనగామ : గర్భస్థ శిశువులకు చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, అక్రమ గర్భస్రావాలకు పాల్పడుతున్న ల్యాబ్ టెక్నీషియన్‌ను జనగామ (Jangaon) పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జనగామ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌చార్జి ఏసీపీ భీమా శర్మ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చిల్పూర్ మండలం మల్లంపూర్ గ్రామానికి చెందిన వేముల ప్రవీణ్ (35) హనుమకొండ గోపాలపూర్‌లో రహస్యంగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు.

గర్భిణులకు అక్రమంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి శిశువు లింగ నిర్ధారణ చేస్తూ ఒక్కో కేసుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్‌ఎంపీలు, మధ్యవర్తుల ద్వారా గర్భిణులను అతని వద్దకు తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు చెందిన గర్భిణి శ్రావణికి లింగ నిర్ధారణ అనంతరం జరిగిన అక్రమ గర్భస్రావం కారణంగా ఆమె మృతి చెందడంతో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.

నిందితుడిపై 2021 నుంచి 2023 మధ్య హనుమకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇదే తరహా ఐదు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. జనగామ బైపాస్ వద్ద వాహన తనిఖీల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి రెండు అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు, హోండా కారు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రమేయం ఉన్న ఆర్‌ఎంపీలు, మధ్యవర్తుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, చేయించడం, అందుకు సహకరించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఏసీపీ భీమా శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసును ఛేదించిన జనగామ పోలీసు బృందాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>