కలం, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని ప్రస్తుత పరిస్థితుల్లో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ రాకపోయినా భారీ స్థాయిలో ఓట్లు లభించాయని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా డీఎంకే తన బాధ్యతను నిర్వర్తిస్తుందని స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తకుండా, మరో ఎన్నికల భారం ప్రజలపై పడకుండా ఉండాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు.
కూటమిలోని రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో సంబంధాలు తెంచుకుని వెళ్లిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, కమ్యూనిస్టు పార్టీలు, వీసీకే అధినేత తిరుమావళవన్ వంటి వారు డీఎంకేతోనే కలిసి నడుస్తామని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సిద్ధాంత పరంగా డీఎంకే బలంగా ఉందని, తమను నమ్మి వెంట నడిచిన వైకో, ప్రేమలత విజయకాంత్ వంటి మిత్రపక్ష నేతలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కూటమిలోని కొన్ని పార్టీలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పటికీ, విధానపరంగా డీఎంకేతోనే కొనసాగుతామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
గడిచిన ఐదేళ్లలో డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని స్టాలిన్ గుర్తు చేశారు. మహిళలు, యువత, విద్యార్థులు, అట్టడుగు వర్గాల కోసం తాము రూపొందించిన పథకాలను కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం బాధ్యతాయుతంగా పని చేయాలని ఆకాంక్షిస్తూ, విజయ్ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి స్టాలిన్ తన శుభాకాంక్షలు తెలియజేశారు.

