కలం, వెబ్ డెస్క్: థాయ్లాండ్ దేశాన్ని వరదలు (Thailand Floods) వణికిస్తున్నాయి. పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన బ్యాంకాక్ నగరంలో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా వరదల కారణంగా 23 మంది మరణించగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నగరంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నగరంలో రోడ్లపై వరద ప్రవహిస్తూ నదులను తలపిస్తోంది. వరదలో చేపలు రోడ్ల మీదకు కొట్టుకు రావడంతో అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
26 లక్షలకు మందికి పైగా..
సుమారు 26 లక్షలకు పైగానే ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. సహాయక కార్యక్రమాలు మరింత వేగవంతం చేశామని.. ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు వివరించారు. రయోంగ్ రాష్ట్రంలోని క్లాంగ్ జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే పలు ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అనేక మంది జాడ గల్లంతు అయిందని.. వారి కోసం వెతుకులాట కొనసాగుతోందని జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు తెలిపారు.

