కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తర్వాత అతి పెద్ద ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు. ఎన్నికల వివాదంగా మారిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈ ప్రాజెక్టు సంబంధించిన పనులు కాస్త నెమ్మదించాయి. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రస్తుతం భూ సేకరణ సమస్యగా మారింది. ముఖ్యంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ భూసేకరణ క్లిష్టంగా మారింది. దీంతో భూ సేకరణ పనులను సర్కార్ వేగవంతం చేసింది.
నార్లపూర్ పంపుహౌస్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు..
ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project)తో పాటు జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఆదేశించారు. భూ సేకరణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సీఎం ఆదేశాలతో జిల్లా మంత్రులు చర్యలు తీసుకున్నారు. నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు నార్లపూర్ వద్ద పంపుహౌస్‌ను పరిశీలించనున్నారు. అలాగే వట్టెం వరకు ఉన్న పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను సందర్శించనున్నారు. సాయంత్రం నాగర్‌కర్నూల్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ పాదయాత్రతోనే ప్రభుత్వంలో కదలిక..
ఈ నిర్వహణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశ కింద నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 1,226 గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు అనుబంధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని కరువు పీడిత జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరు, పారిశ్రామిక నీటి సరఫరా అందిస్తామన్నారు. అటు ఈ ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర చేపడుతోందని ప్రకటించగానే.. సీఎం రేవంత్ ప్రాజెక్టుపై సమీక్ష చేపట్టారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు 95 శాతం పూర్తి అయ్యాయని అంటున్నారు. కాలువలు దాదాపు 98 శాతం బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేశామని.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత టెండర్లు క్యాన్సల్ చేశారని ఆరోపిస్తున్నారు. జూన్ లో బీఆర్ఎస్ పాదయాత్ర ఉంటుందని.. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేపట్టబోతున్నామని తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో పాలమూరు – రంగారెడ్డిని పూర్తి చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.

