కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. తీవ్రమైన ఎండ తీవ్రత (Heat Wave) కారణంగా ఒక్కరోజే వడదెబ్బ తగిలి ఏకంగా 54 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 17 మంది మరణించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మంది, కరీంనగర్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. నల్గొండలో ఆరుగురు, ఆదిలాబాద్ జిల్లాలో ఐదుగురు ఎండ తీవ్రతకు బలయ్యారు. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మహబూబ్ నగర్, మేడ్చల్, సిద్దిపేట జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ఈ దారుణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. శాస్త్రవేత్తలు, అధికారులు ప్రజలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో రోహిణి కార్తె ప్రారంభమైంది. దీనివల్ల ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.

