కలం, మెదక్ బ్యూరో : ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఎల్ నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు, జిల్లాల వారీ అమలు తీరుపై ప్రజాప్రతినిధులు , అధికారులు సమగ్రంగా చర్చించారు. ఈ సమీక్ష సందర్బంగా అధికార పార్టీ ,ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
ముందస్తు ప్రణాళిక ఏది?: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఎల్ నినో ప్రభావంతో వరి కాకుండా ఇతర పంటల సాగు చేయాలని ప్రభుత్వం ,అధికారులు చెబుతున్న క్షేత్రస్ధాయిలో వేరే పంటల వేయడానికి ప్రోత్సహించే విధంగా రైతులకు సకాలంలో అవగాహన, సమాచారం ఇవ్వలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో రైతులు వరి నాట్లు వేశారని చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గం పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో కోతుల బెడద ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. రైతులు వరి తప్ప వేరే పంటలు వేసే పరిస్దితి ఉండదని, ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలంటే కోతుల నివారణకు ప్రత్యేక కార్యకరణ రూపొందించాలన్నారు. అలాగే సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తుల వలన మంజీరా పరివాహక ప్రాంతాల్లో అధికారికంగా క్రాఫ్ హలిడే ప్రకటించి , రైతులకు పరిహరం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు చెరుకు సాగు చేయడానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని , చెరుకు కాకుండా వేరే పంటలు వేయాలని రైతులకు సూచించమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే దీనిపై జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు . చెరుకు సాగు చేయవద్దని మీటింగ్ లో చెప్పడం కాదని, క్షేత్రస్ధాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించరా? అన్ని ప్రశ్నించారు. కేవలం పేపర్ల మీద , సమావేశాల్లో చెబితే రైతులకు ఎలా తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకు సాగు తర్వాత క్రాషింగ్ కు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తుంటే ..ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటల సాగు అని ప్రభుత్వం చెప్పడం వలన ఏమి లాభమని మండిపడ్డారు.
అప్రమత్తంగా ఉండాలి .. మంత్రి వివేక్
ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎల్ నినో ఒక సహజ ప్రకృతి విపత్తు అని, దీని ప్రభావం తెలుసుకొని నష్టాన్ని వీలైనంత తగ్గించే దిశగా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తుందన్నారు. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు నష్టపోకుండా వరి కాకుండా ప్రత్యామ్నాయ సాగునే ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. లోటు వర్షపాతం, నీటి కొరత, పంటలపై ప్రతికూల ప్రభావం వంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్, ఎనిమిది ఎకరాల కంది పంట సాగు చేయవచ్చని పేర్కొన్నారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, అంతర్ పంటల సాగుపై దృష్టి సారించేలా అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలలో పలుచోట్ల కోతుల బెడద ఉన్నందున దానిని నివారించే చర్యలు చేపడితే రైతులు పంటల మార్పిడి వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు వీడియో రీల్స్, నాటక ప్రదర్శనలు, కళాజాతాలు, అన్ని ప్రచార మాధ్యమాలను వినియోగించాలని సూచించారు.
ఎల్ నినో ప్రభావం తీవ్రత పెరిగితే భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున నీటి వృథాను అరికట్టడంతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. బోర్వెల్ల రీచార్జ్, వర్షపు నీటి సంరక్షణ, నీటి వినియోగంలో పొదుపు వంటి చర్యలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.

