కలం, నిర్మల్ : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నిర్మల్ సీపీఎం (Nirmal CPM) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొమ్మెన సురేష్ మాట్లాడుతూ.. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
విద్యా వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేపర్ లీకేజీ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లడఖ్‌కు రాజ్యాంగ పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ కోసం ఉద్యమిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం నూతన్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

