కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగంను బలోపేతం చేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అహర్నిశలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి (Minister vakiti srihari) చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం యువత సంక్షేమం వారి భవిష్యత్తు కోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు వివరించారు.
గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.30 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
SETWIN, TASK ద్వారా నైపుణ్య శిక్షణలు అందిస్తూ, యువతను ఉద్యోగయోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మెగా జాబ్ మేళా లో 105 కంపెనీలు పాల్గొంటున్నాయి, ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళాను ఉపయోగించుకొని యువత తమ ప్రతిభను ప్రదర్శించి ఉద్యోగాలు సాధించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
భవిష్యత్తుకు నైపుణ్యాలే కీలకం: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో కీలకమని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని, కంప్యూటర్, కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ATC సెంటర్ల ద్వారా ఆధునిక శిక్షణ, SETWIN పునరుద్ధరణ, TASK ద్వారా కంప్యూటర్ శిక్షణ వంటి చర్యలతో యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. “భారత్ ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
యువతకు భారీ అవకాశాలు : మధుసూదన్ రెడ్డి
99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్ లను నిర్ణయించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్ మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో సుమారు 100 కంపెనీలు పాల్గొని 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలలో మే 23న నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ చైర్మన్ శివ సేనా రెడ్డి, సోని బాల దేవి, టాస్క్ సీఈఓ నితిన్ కుమార్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్ల కోత్వాల్, నగర డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం.యాదయ్య, జిల్లా క్రీడలు యువజన అధికారి రాజశేఖర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

