కలం, ఖమ్మం బ్యూరో: మొక్కజొన్న కొనుగోలు (Maize Procurement) విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు భరోసా కల్పించారు. పాలేరు నియోజక వర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం నాగులవంచ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, అలాగే మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మొక్కజొన్న వస్తుందన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ప్రైవేట్ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారని, దీంతో ఒక్కసారిగా కొనుగోలు కేంద్రాలపై ఒత్తిడి పెరిగిందన్నారు.
ముందస్తు ఏర్పాట్లు చేయాలి..
ఖమ్మం (Khammam) జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు తక్షణం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రవాణా, హమాలీ సంబంధిత సమస్యలు ఎలాంటి పరిస్థితుల్లోనూ తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. మార్కెట్ యార్డుల్లోకి వచ్చే నాణ్యమైన మొక్కజొన్నను మద్దతు ధరతో 2–3 రోజుల్లో కొనుగోలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా అకాల వర్షపాతం వలన మొక్కజొన్న ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు తూకం చేసి సురక్షితంగా నిల్వ చేయాలని తెలిపారు.
రైతులకు అన్ని విధాలుగా సహకరించాలి..
పంట దిగుబడి అధికంగా ఉన్న ఈ సమయంలో రైతులకు అన్ని విధాలుగా అధికారులు సహకరించాలని కలెక్టర్ సూచించారు. మొక్కజొన్న నిల్వపై అన్ని మార్కెట్ యార్డుల్లో సమాంతరంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు కొనుగొలు ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు. అకాల వర్షాలకు ముందస్తు చర్యల్లో భాగంగా గన్నీబ్యాగులు, టార్పాలిన్ కవర్ లు అందుబాటులో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అలీమ్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ సెక్రటరీ పీ.వీరాంజనేయులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

