కలం, ఖమ్మం బ్యూరో: మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు చికెన్ స్థానంలో చేపలు పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని (99 Day Action Plan) అధికారులు, ప్రజా ప్రతినిధులు విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై సమావేశం జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆది నారాయణ, మాలోతు రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు.
99 రోజుల కార్యాక్రమంలో చేపట్టే కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఖమ్మం కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళిక (99 Day Action Plan) ప్రకారం అమలు చేయాలన్నారు. ఆర్థిక స్థితిగతులు సహకరించక పోయినా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. రైతులు పండించే పంటకు బోనస్ అందించి వారిలో విశ్వాసం కల్పించడమే కాకుండా పేదలకు నాణ్యమైన సన్న బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు.
క్రీడలతో భవిష్యత్తు ఉంటుందనే భావన యువతకు వచ్చేలా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గచ్చిబౌలిలో హాకీ క్రీడలు ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఆధారంగానే ప్రజల్లో ప్రభుత్వం పట్ల స్పందన ఉంటుందని మంత్రి తెలిపారు. 99 రోజుల కార్యాచరణ సంవత్సరం మొత్తం కొనసాగించాలని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంయుక్తంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు.
అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Collector Anudeep Durishetty) మాట్లాడారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణపై ఉమ్మడి జిల్లాలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటిడిఎ పీవో బి. రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: 10న బీఆర్ఎస్ఎల్‌పీ మీటింగ్.. అసెంబ్లీలో వైఖరిపై చర్చ
Follow Us On: Instagram

