Mobile Popup Ad
Mobile Popup Ad

10న బీఆర్ఎస్ఎల్‌పీ మీటింగ్.. అసెంబ్లీలో వైఖరిపై చర్చ

కలం, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS) అసెంబ్లీలో ఎలాంటి వైఖరి అవలంబించాలి? ఏయే అంశాలను లేవనెత్తాలి? చట్ట సభల వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రభుత్వ వైఫల్యాలేంటి? అనే అంశాలపై ఫోకస్ పెట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన ఈ నెల 10న ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనుంది. కేవలం సమావేశానికే పరిమితం చేయకుండా వర్క్ షాప్ తరహాలో నిర్వహించాలని భావిస్తున్నది. పార్టీ సెంట్రల్ ఆఫీస్ తెలంగాణ భవన్‌లో నిర్వహించడమా? లేక ప్రైవేటు రిసార్టులోనా? అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. పవర్‌లోకి రాకముందు ఇచ్చిన హామీలు, రెండేండ్లు దాటినా వాటిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం తదితర అంశాలపై సంబంధిత శాఖల మంత్రులను, ముఖ్యమంత్రిని నిలదీయాలని ఆలోచిస్తున్నది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎక్స్ పోజ్ చేసేలా.. :

కాంగ్రెస్ 420 (ఫోర్ ట్వంటీ) హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు తరచూ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (Revanth Reddy), రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రెండున్నర వేల ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం.. ఇలాంటివేవీ అమలుకు నోచుకోలేదని, కేవలం పొలిటికల్ ప్రయోజనం కోసమే మోసపూరిత వాగ్ధానాలు చేశారన్నది వీరి ఆరోపణ. ఇంకోవైపు మూసీ పునరుజ్జీవనం పేరుతో పేదల ఇండ్లను కూలుస్తున్నదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వీరిద్దరూ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ బాధితులను కలుస్తున్నారు. ప్రజల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, నిలదీసేలా వ్యవహరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎల్‌పీ (BRSLP) ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఇటు అసెంబ్లీలో.. అటు ప్రజాక్షేత్రంలో.. :

ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తుతూనే మరోవైపు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను ప్రస్తావించి వైఫల్యాలను ఎండగట్టాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. ప్రజల్లోకి వెళ్ళి చేసిన ఆందోళనలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చేలా, దృష్టిని ఆకర్షించేలా బీఆర్ఎస్ (BRS) ప్లాన్ చేస్తున్నది. బడ్జెట్ సమావేశాలు మార్చి 30 వరకు నిర్వహించేలా ప్రాథమిక షెడ్యూలు ఖరారైనందున మరిన్ని రోజులు పెంచాలని స్పీకర్‌పై, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశమున్నది. ఏయే అంశాలపై ప్రత్యేక చర్చ జరగాలో, ప్రభుత్వాన్ని నిలదీయాలో ఎల్పీ సమావేశంలో చర్చించి దానికి తగినట్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ వర్క్ డివిజన్ చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు కూడా హాజరయ్యే అవకాశమున్నది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి రోజున గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, 20న బడ్జెట్‌ను సభకు సమర్పించడం.. ఇవి ఖరారయ్యాయి.

Read Also: చివరి దశకు ఆపరేషన్ కగార్: నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అర్బన్ నక్సల్స్!!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>