కలం, నల్లగొండ బ్యూరో: నీటి హక్కుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల అంశంలో తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల విషయంలో చారిత్రక ద్రోహనికి పాల్పడిందే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని విరుచుకుపడ్డారు. ఫలితంగా దక్షిణ తెలంగాణా ప్రాంత రైతాంగం నీటి కొరతతో పడరాని పాట్లు పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకీడు మండలం జానపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి అంశంలో ప్రజలు పడుతున్న కష్టాలకు బీఆర్ఎస్ (BRS) పాలనలో జరిగిన అలసత్వమే కారణమన్నారు. కృష్ణా నది సాక్షిగా చెబుతున్నా నదీ జలాల అంశంలో తెలంగాణాకు చెందాల్సిన నీటి బొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందని ఆయన తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదల రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని, ధాన్యం దిగుబడిలో నమోదు అయిన రికార్డు అందుకు అద్దం పడుతుందన్నారు. నీటి హక్కుల విషయంలో నిర్లక్ష్యం చూపిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనను చీకటిదశగా ఆయన అభివర్ణించారు. వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో సహా నెట్టెంపాడు, కోయిలసాగర్, పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ, డిండితో పాటు చిన్న తరహా ఎత్తిపోతల పథకాలన్నింటిని పూర్తి చేసి వ్యవసాయానికి సమృద్ధిగా సాగు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.

