కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అధికారులకు స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. పనుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించేది లేదని, నిర్దేశిత లక్ష్యాల సాధనకు బాధ్యతాయుతంగా పనిచేయాలని తీవ్ర హెచ్చరికలు చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి పలు శాఖల అధికారులతో ఖమ్మం అభివృద్ధి పనులపై (Development Works) నిర్వహించిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నగరంలో ఎంతగానో నిరీక్షిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉందన్న మంత్రి, పనులను త్వరితగతిన పూర్తి చేసి నవంబర్ నాటికి హ్యాండోవర్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేబుల్ బ్రిడ్జితో పాటే మెడికల్ కాలేజీ హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. మరోవైపు వెలుగుమట్ల కాలనీలోని ఇళ్ల నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, అంగన్వాడీ కేంద్రం తదితర అన్ని మౌలిక వసతులను నవంబర్ 21లోగా పూర్తి చేసి దానిని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి ఇంటికీ పీఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ రూఫ్‌టాప్‌లను అనుసంధానించాలని సూచించారు.మున్నేరు రక్షణ గోడ భూసేకరణకు సంబంధించిన 10-ఏ మినహాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, డ్రైనేజీ డిజైన్లు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లేఅవుట్‌ను త్వరగా సిద్ధం చేసి వచ్చే వర్షాకాలం లోగా పనులు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. సాగు నీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, గోదావరి జలాలను పక్కా ప్రణాళికతో వినియోగించి ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూడాలన్నారు.
మంచుకొండ ఎత్తిపోతల చెరువులను నింపడంతో పాటు, చాలా కాలంగా ఆలస్యమవుతున్న బుగ్గవాగు ఎత్తిపోతల పనులను వెంటనే ప్రారంభించాలని, గ్రావిటీ ద్వారా నీటిని అందించే కాలువల అంచనాలను సవరించి సమర్పించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా వేళలను ప్రజలకు ముందే తెలియజేయాలని, అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు.రబీ సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి, ప్రత్యామ్నాయ పంటలు వేసేలా సెప్టెంబర్ నెలాఖరుకల్లా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా పెంచాలని పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో గుడిసెలు, శిథిలావస్థ ఇళ్లలో నివసిస్తున్న పేదలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అక్టోబర్ నుంచి జూన్ వరకు లభించే అనుకూలమైన పనుల సీజన్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అందుకోసం సెప్టెంబర్ నెలాఖరుకల్లా మంజూరైన పనుల టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఖమ్మం నగరానికి వచ్చే పదేళ్ల విద్యుత్ అవసరాలను అంచనా వేసి కొత్త సబ్స్టేషన్లు, భూగర్భ కేబుళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విద్యా రంగానికి సంబంధించి పాఠశాలలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, ఖమ్మంలో నిర్మాణం అవుతున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి, రాష్ట్రంలోనే తొలి పాఠశాలగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ( Collector Divakara TS) మాట్లాడుతూ.. రూ.36.60 కోట్లతో హ్యామ్ రోడ్ల టెండర్లు పూర్తయ్యాయని, నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నగరంలో 7 కొత్త సబ్స్టేషన్లకు స్థలాలు కేటాయించామని, ఖమ్మం ఖిల్లా రోప్‌వే పనులు 2027 మార్చి నాటికి పూర్తవుతాయని వివరించారు. కేఎమ్‌సీ పరిధిలోని 137 పనుల్లో 54 పూర్తి కాగా, మరో 54 పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కేఎమ్‌సీ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

