కలం, ఖమ్మం బ్యూరో: ఎల్నినో ప్రభావంతో గోదావరి నదిలో నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో, నదిలో ఉన్న ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి వృథా కాకుండా నిల్వ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం ఆయన అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్ట (Dummugudem Barrage) ను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇసుక బస్తాలతో చేపడుతున్న పనులను మంత్రి నిశితంగా తనిఖీ చేశారు. గత పది రోజులుగా శ్రమించి మూడు లేయర్ల పనులు పూర్తి చేసిన అధికారులను అభినందిస్తూ, మిగిలిన రెండు లేయర్ల పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఇసుక బస్తాల మధ్య నుంచి చుక్క నీరు కూడా లీకేజీ కాకుండా ప్రత్యేక రక్షణ షీట్లు ఏర్పాటు చేయాలని, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.
ఈ ఏర్పాట్ల ద్వారా సుమారు 1.2 మీటర్లకు పైగా అదనపు నీటిమట్టం నిల్వ ఉంటుందని, తద్వారా అశ్వాపురం నుంచి మిషన్ భగీరథ ద్వారా మూడు జిల్లాలకు రానున్న మూడు నుంచి నాలుగు నెలల పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. వరద ప్రవాహం పెరిగితే బస్తాలకు నష్టం కలగకుండా పవర్ హౌస్, కాటన్ గేట్ల ద్వారా నీటిని నియంత్రించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పూర్తయితే 36 టీఎంసీల నీటి నిల్వతో పాటు 350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
అలాగే కాళేశ్వరం గేట్ల నిర్వహణకు అనుమతుల సమస్యలు ఉన్నందున, సమ్మక్క సారక్క బ్యారేజీ వద్ద అదనంగా మూడు నుంచి నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నీటి నిల్వను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అమ్మగారిపల్లి సర్పంచ్ కవిత, ఇరిగేషన్ ఎస్ఈ మహేశ్వరరావు, ఈఈ రాంబాబు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

