కలం, ఖమ్మం బ్యూరో: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి రైలు వసతి కల్పించడమే ప్రధాన ధ్యేయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ఫోన్ చేసి ఇదే అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి దేశ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని మంత్రి తుమ్మల వివరించారు. వారి సౌకర్యార్థం ప్రతిపాదిత నూతన రైల్వే లైన్లను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తే..
పాండురంగాపురం నుంచి భద్రాద్రి (భద్రాచలం) వరకు నూతన రైల్వే లైన్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని మంత్రి తుమ్మల కోరారు. దీంతో పాటు ప్రాంతీయ రవాణా అవసరాలను తీర్చేందుకు సత్తుపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కోవూరు వరకు రైల్వే లైన్ విస్తరణ, పెనుబల్లి మీదుగా ఏపీ రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానం కల్పిస్తే.. రెండు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక, సరకు రవాణాతో పాటు ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని వివరించారు. మంత్రి తుమ్మల చేసిన విజ్ఞప్తులపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

