కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో సుమారు రూ.100 కోట్లతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నెల 12న అంగరంగ వైభవంగా భూమిపూజ నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala) తెలిపారు. శనివారం అధికారులతో కలిసి ఆలయానికి భూమి పూజ చేసే స్థలాన్ని పరిశీలించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 20 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి ఆలయ నమూనాలో, ఆగమ శాస్త్ర ప్రకారం దీనిని నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా భూసేకరణ పూర్తి చేసిన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డిని అభినందించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సహకారంతో పనులు వేగవంతం చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ ఆలయంతో పాటు ఇస్కాన్, స్వామి నారాయణ సంస్థల నిర్మాణాలతో ఖమ్మం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. పర్యాటకుల కోసం హరిత హోటల్ స్థలాన్ని గుర్తించాలని, కేబుల్ బ్రిడ్జి, రోప్‌వే వంటి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తదితరులు స్థల పరిశీలనలో పాల్గొన్నారు.

