కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో సంతోషీమాత దేవాలయంలో దాడి ఘటనపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా.. రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన బండి సంజయ్.. పార్టీ నేతలు మనోహర్ రెడ్డి, సంగప్ప, శ్రీవర్దన్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
దిల్సుఖ్నగర్లో సంతోషీమాత దేవాలయంలో దాడి (Santoshi Mata Temple Attack) హేయనీయమని పేర్కొన్నారు. దాడి చేసిన మతం వాళ్లు బాధపడతారనే కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజలు నిలదీస్తే దాడి చేసినోడిని పిచ్చోడిగా చిత్రీకరించడం ప్రభుత్వానికి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడికి మందిరాలు, మసీదు అనే తేడా తెలియదని.. కానీ మందిరాలపైనే ఎందుకు దాడి చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
హిందువులు స్పందించకపోవడం వల్లే..
ఇలాంటి ఘటనలు జరుగుతున్నా హిందువులు ధీటుగా స్పందించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పద్దతి మార్చుకుని దాడి చేసిన వాళ్లపై కఠినాతికఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే యువత రోడ్లపైకి వచ్చి తిరగబడితే.. వాళ్లను ఆపే పరిస్థితి ఉండదు అని హెచ్చరించారు.
ఆలయాలపై దాడుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి తెలంగాణకు రావాల్సి ఉన్నప్పటకీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన పర్యటన వాయిదా పడిందని చెప్పుకొచ్చారు.

