కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోనే అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. శనివారం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్,ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభివృద్ధి పనులు ఏ స్థాయిలో ఉన్నాయో మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు. కాలనీలో ఇప్పటికే విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వీధి దీపాల పనులు పూర్తి అయ్యాయని, వాటర్ ట్యాంక్ నుండి ఇంటింటికీ త్రాగునీటి పైప్‌లైన్ అనుసంధానం జరుగిందని తెలిపారు. అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణం, రవాణా సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజల మౌళిక అవసరాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి కుటుంబానికి త్రాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి సదుపాయాలు సమగ్రంగా అందించేందుకు అధికారులు చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. గత పది సంవత్సరాల కాలంలో పేదలు మౌళిక సదుపాయాల కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన గృహ నిర్మాణం పూర్తి చేయించడమే లక్ష్యమన్నారు. వెలుగుమట్ల కాలనీలో విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్య వ్యవస్థ వంటి అన్ని సదుపాయాలు సమగ్రంగా ఏర్పాటు చేసి ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. కాలనీలో స్కూల్, కమ్యూనిటీ హాల్, పార్క్ వంటి సామాజిక వసతులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు.
నెలలోపు డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేయాలని, వర్షాకాలం కాలనీలో నీటి నిలువ సమస్యలు ఉండకూడదని మంత్రి ఆదేశించారు. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ఆర్&బీ ఎస్ఈ యాకుబ్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు డి. జయచందర్, సైదులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

