కలం, హనుమకొండ: పేదరికంతో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. ఒకప్పుడు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చేవి కావని, నేడు ప్రజా ప్రభుత్వంలో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం హసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లెకి విచ్చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, వీఓ బిల్డింగ్ ని ఆమె ప్రారంభించారు.
అనంతరం ఎంపీ కడియం కావ్య, శాసనసభ్యులు నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఫిష్ మొబైల్ వ్యాన్ అందించామని, వాటి ద్వారా లబ్ధిదారులు ఆదాయం పొందుతున్నారని గుర్తుచేశారు. మహిళలకు రుణ బీమా సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి గుర్తింపు కల్పించామని, ‘అమ్మ చేతి వంట’ పేరుతో ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణంతో గ్రామీణ పేద మహిళల రవాణా ఖర్చులు తగ్గాయని, సన్నబియ్యం పంపిణీతో బహిరంగ మార్కెట్లోనూ వాటి ధరలు తగ్గాయని పేర్కొన్నారు. మహిళలు, రైతులు, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

