కలం, వెబ్ డెస్క్: అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల తూటాలతో అసెంబ్లీ దద్దరిల్లుతోంది. రైతు రుణమాఫీ, రైతు బంధుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క (Seethakka) సభలోనే కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చింది తమ ప్రభుత్వమని చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పుకునే బీఆర్ఎస్.. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలు ఎలా ఉన్నాయంటే.. పాండవులు సంపాదించినదంతా కౌరవుల తద్దినానికే అన్నట్లుందని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రాన వారికి జీతాలు అందాయా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పరీక్షలు జరిపి.. నియామకపత్రాలు ఇచ్చిందని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయిందనే బాధ తప్ప.. ప్రజల గురించి ఆలోచనే లేదని ఆగ్రహించారు.
బీఆర్ఎస్(BRS) చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందని అసెంబ్లీలో సీతక్క చురకలు అంటించారు. ఇంత బాగా మాట్లాడిన హరీశ్ రావు.. రైతులకు అప్పు ఎవరికి హయాంలో జరిగింది? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే.. ఎందుకు అప్పులు కట్టలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏకకాలంలో రూ. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. యాసలు, ప్రాసలు బాగా మాట్లాడుతున్నారు కానీ.. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు? రెండున్నరేళ్లకే మా ప్రభుత్వంపై ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు మీరేం చేశారో లెక్కలతో సహా చెప్పాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలను ప్రశ్నించారు. ఎన్ని లక్షల మందికి ఇళ్లు ఇచ్చారు? ఎన్ని లక్షల మందికి ఉదోగాలు ఇచ్చారు? ఎంత మందికి రుణామాఫీ చేశారో లెక్కలతో సహా వెల్లడించాలని సీతక్క డిమాండ్ చేశారు.

