కలం, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ (Seva Sankalp Abhiyan) నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీతో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు పాల్గొంటాయని చెప్పారు. దేశ నిర్మాణం, ప్రజా సంక్షేమం, సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పలు కార్యక్రమాలు రూపొందించినట్లు వివరించారు.
దీపాల వెలుగుతో ప్రచారానికి శ్రీకారం
సెప్టెంబర్ 17న మోదీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజలను బలవంతం చేయబోమని, పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఆయన అన్నారు. రక్తదాన శిబిరాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు తదితర కార్యక్రమాలు కూడా ప్రచారంలో భాగంగా ఉంటాయి.
25 ఏళ్ల రాజకీయ ప్రయాణంపై రాజ్‌నాథ్ వ్యాఖ్యలు
ప్రధాని మోదీ సెప్టెంబర్ 17న జన్మదినాన్ని జరుపుకోనున్నారని, అక్టోబర్ 7న ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రయాణం దేశ రాజకీయాలతో పాటు అభివృద్ధి, సుపరిపాలన అంశాలపై ప్రభావం చూపిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
‘వందేమాతరం’కు పశ్చిమ బెంగాల్ గౌరవం
ఇక, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ‘వందేమాతరం’లోని ఆరు చరణాలను ఆలపించడం ప్రత్యేక ఘట్టమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇది పశ్చిమ బెంగాల్‌కు కూడా గౌరవకరమైన విషయమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో పశ్చిమ బెంగాల్ కీలక పాత్ర పోషిస్తుందని, సువేందు అధికారి నాయకత్వంలో రాష్ట్రం ఆ దిశగా సహకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం కీలక భేటీ
Follow Us On: X(Twitter)

