కలం, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ (Warangal) అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు టెండర్ (Underground Drainage Tenders) ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని సీడీఎంఏ డాక్టర్ టీకే. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీపీఆర్, టెండర్ల ప్రక్రియ, పనుల నిర్వహణపై సమీక్షించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, కమిషనర్ టి. వెంకన్న, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
డీపీఆర్‌కు సంబంధించిన అంశాలను సమగ్రంగా క్రోడీకరించి, అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి టెండర్లను ఆహ్వానించాలని సీడీఎంఏ సూచించారు. ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయికి తెలిపారు. టెండర్ల ఆహ్వానానికి చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్‌కుమార్, ఈఈ రవికుమార్, సీపీఓ రవీంద్ర రాడేకర్ తదితరులు పాల్గొన్నారు.

