నిజాంపేట్ MRO ఆఫీసులో లంచాలు.. రైతుల ఆందోళన!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం (Nizampet MRO Office) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ భూముల రిజిస్ట్రేషన్ల కోసం అధికారులు, సిబ్బంది రూ. లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందేనని, డబ్బులు ఇవ్వకపోతే పనులు చేయడం లేదని బాధిత రైతులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు..

ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.50 వేల నుండి రూ.1 లక్ష వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రిజిస్ట్రేషన్‌కు ఒక రేటు నిర్ణయించడమే కాకుండా, దరఖాస్తు ఫైలు ముందుకు కదలాలన్నా ప్రత్యేకంగా డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోయారు. నిజాంపేట్‌లోని ఒక మీసేవ కేంద్రం నిర్వాహకుడిని మధ్యవర్తిగా పెట్టుకుని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు బహిరంగంగా ఆరోపించారు. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంలో తహసీల్దార్ నాగజ్యోతితో పాటు కార్యాలయ సిబ్బంది ప్రమేయం కూడా ఉందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి వ్యవసాయం చేసుకునే రైతుల నుండి ఈ రకంగా అదనపు వసూళ్లకు పాల్పడటం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.

సమగ్ర విచారణకు డిమాండ్..

బాధిత రైతులకు మద్దతుగా పలువురు స్థానికులు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు, అదనపు వసూళ్లపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>