కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఏఈవోలు నిరంతర పర్యవేక్షణ చేయాలని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) హెచ్చరించారు. చిగురు మామిడి మండల కార్యాలయాల్లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలపై సంబధిత అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. చిగురు మామిడి మండలంలో 21 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా 7 కేంద్రాలకు ఎమ్మార్వో, 7 కేంద్రాలకు ఎంపీడీఓ, మరో 7 కేంద్రాలకు వ్యవసాయ అధికారి ఇంచార్జులుగా ఉంటారని, డీపీఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక జీపీవో, గ్రామ కార్యదర్శి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని సూచించారు.
తాగునీటి సమస్యలు పరిష్కరించండి..
చిగురు మామిడి మండలంలో వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో సమస్యలు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దొంతులపల్లిలో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ సమస్యల్లో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సుందరిగిరిలో ఇప్పటికే వేసిన బోరుకి మోటార్‌కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడం పై విద్యుత్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి వనరులు ఉన్న బావుల నుండి పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. కొత్తపల్లి – హుస్నాబాద్ మధ్య నిర్మిస్తున్న నాలుగు లేన్ రోడ్డులో పైప్ లైన్ ఎందుకు షిఫ్ట్ చేయలేదని అధికారులను ప్రశ్నించారు. రాజీవ్ రహదారి కొత్తపల్లి నుండి హుస్నాబాద్ మధ్య జరుగుతున్న నాలుగు లైన్ రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, వర్షాకాలం వస్తే పనులకు ఆటంకాలు అవుతాయని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచండి..
బడి బాట ద్వారా ఇంటింటికి తిరిగి పిల్లలు చేరేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. వన మహోత్సవం ద్వారా 80 వేల మొక్కలు నాటాలని అధికారులు పెట్టుకున్న లక్ష్యానికి మించి అదనంగా ప్లాంటేషన్ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని, మండలంలో కొత్త రోడ్లు పూర్తయిన ప్రాంతాల్లో ఇరువైపుల మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయి పని ప్రారంభం కాని 9 ఇళ్లు నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ఆదేశించారు. మండలంలో ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, డీపీఓ జగదీశ్వర్, డీఆర్డీఓ శ్రీధర్, జెడ్పీసీఈఓ శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

