Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ మోసపూరిత యాత్రలు: పొన్నం

కలం, వెబ్ డెస్క్: బీజేపీ యాత్రల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. పెరుగుతున్న ధరల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు “రైతు ఘోస – బీజేపీ భరోసా” పేరుతో బస్సు యాత్రలు చేస్తోందని ఆరోపించారు. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పెరుగుతున్న ధరలతో రైతులకు ఇబ్బందులు

రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు అన్నీ పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు.  రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఈ అంశంపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.

కేంద్రం సహకరించడం లేదు

‘కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్ సాంక్షన్ చేయడంలో, లేవీ రైస్‌కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం సహకరించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదు.  రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.‘ అంటూ పొన్నం పేర్కొన్నారు.

యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు

‘రాష్ట్రవ్యాప్తంగా 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 21 కోట్ల గోనె సంచులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ. 8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించింది.‘ అంటూ పొన్నం ఫైర్ అయ్యారు.

రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ

‘బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రైతులకు మాత్రం నయా పైస రుణమాఫీ చేయకపోవడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం. మొక్కజొన్న రైతులను అవమానపరుస్తూ క్వింటాకు కేవలం రూ. 10 మాత్రమే ఎంఎస్‌పీ పెంచడం సిగ్గుచేటు. దీనిపై కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతన్నలు బీజేపీ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపై లాఠీచార్జీలు చేయించిన ఘటనలు దేశం చూసింది. రైతుల బాధలను పట్టించుకోని బీజేపీ నేతలు ఇప్పుడు రైతు ప్రేమ గురించి మాట్లాడటం కపట నాటకం. ‘ అంటూ పొన్నం పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>