కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా ఆంజనేయస్వామి అన్ని ఆలయాల్లోనూ బ్రహ్మచారి స్వరూపంలోనే దర్శనమిస్తాడు. కానీ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని గిరిజాబంధ్ హనుమాన్ ఆలయంలో మాత్రం హనుమంతుడు మహిళా రూపంలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ఇక్కడ స్వామిని “మాతా హనుమాన్”గా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రపంచంలో మహిళా స్వరూపంలో హనుమంతుడు దర్శనమిచ్చే అరుదైన క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
‘మాతా హనుమాన్’గా ప్రసిద్ధి
ఈ ఆలయంలో ఆంజనేయస్వామిని “మాతా హనుమాన్” అని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో ఉన్న రతన్‌పూర్ క్షేత్రం మహామాయాదేవి శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది. అలాంటి పవిత్రక్షేత్రంలో హనుమంతుడు శక్తిరూపిణిగా దర్శనమివ్వడం భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తుంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు మహిళా అలంకరణలో దర్శనమివ్వడం ప్రధాన విశేషం. స్వామికి కుంకుమ, ముక్కుపుడక, చీరకొంగు వంటి అలంకరణలు చేస్తారు. భుజాలపై శ్రీరాముడు, లక్ష్మణుడు ఉండగా, పాదాల కింద అహిరావణుడు, మహిరావణుడు అణచివేయబడి కనిపిస్తారు. ఈ రూపం భక్తులకు భక్తి, శక్తి, రక్షణకు ప్రతీకగా భావించబడుతుంది.

