కలం, కరీంనగర్ బ్యూరో: వచ్చే ఏడాది జూన్ వరకు వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని సూచించారు. సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యమన్నారు.
మూడు జిల్లాల కలెక్టర్లతో..
ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై గురువారం ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమవతి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి, అదనపు కలెక్టర్లు, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య మరింత తీవ్రం..
రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఆరుతడి పంటల సాగుపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ వంటి పంటల సాగును ప్రోత్సహించాలని, పశుసంపద అధికంగా ఉన్న ప్రాంతాల్లో పశుగ్రాస కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
వేగంగా అభివృద్ధి పనులు..
హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, 250 పడకల ఆసుపత్రి, పీజీ మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్–హుస్నాబాద్ ఫోర్ లేన్ రహదారి, అక్కన్నపేట–హుస్నాబాద్ రహదారి విస్తరణ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు.
రూ.250 కోట్లు మంజూరు..
గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం రూ.250 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.

