కలం, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, విద్య, వైద్యం వంటి అన్ని రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురు మామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన వివో మహిళా సమైక్య భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మహిళా సమైక్య భవనం ప్రారంభం సందర్భంగా ఓగులాపూర్ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మహిళా సమైక్య భవనం కేవలం ఒక భవనం మాత్రమే కాదు, గ్రామ ప్రజల ఐక్యతకు, మహిళల సాధికారతకు, గ్రామాభివృద్ధికి ఒక కేంద్ర బిందువుగా నిలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ భవనం ద్వారా మహిళా సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, శిక్షణా తరగతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన సమావేశాలు ఇకపై ఒకే చోట నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమైక్య భవనం గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ ఉపయోగపడేలా అందరూ కలిసి పరిరక్షించాలని సూచించారు. ఓగులాపూర్ గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తుందని అన్నారు. ఈ భవనం నిర్మాణానికి స్థలం విరాళం ఇచ్చిన దాతలకు మంత్రి పొన్నం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌లు , సర్పంచ్‌లు , వివిధ విభాగాల అధికారులు, గ్రామ మహిళా సమైక్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

