Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్యసభ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణం

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ కార్యకర్తలు, ఎంపీలకు ఖర్గే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను ఎగువ సభలో మరింత బలంగా గళమెత్తుతామని, అదే తన అతి పెద్ద బాధ్యతని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గేకు గుర్తింపు..

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన మల్లికార్జున ఖర్గేను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ రాజ్యసభ సచివాలయం సోమవారం బులెటిన్ విడుదల చేసింది. వాస్తవానికి జూన్ 25వ తేదీతో ఎంపీగా పదవీ కాలం ముగిసింది. తిరిగి మరోసారి ఎన్నికైన నేపథ్యంలో జూన్ 26వ తేదీ నుంచే ఆయన్ను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నట్లు అందులో పేర్కొంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయనకు అందించే జీతభత్యాలు, సౌకర్యాలు 1977 చట్టంలోని సెక్షన్-2 నిబంధనల ప్రకారం అమల్లోకి వస్తాయని వివరించింది.

రెండోసారి ఎంపీగా ఎన్నిక..

మల్లికార్జున ఖర్గే మొదటిసారి 2020లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్టీ పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 2026లో ఆయన పదవీ కాలం పూర్తి కాగా, మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని ఖర్గే అధిష్ఠానానికి సూచించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో కర్ణాటకలో నాయకత్వ మార్పు కారణంగా సీఎం సీటు కోల్పోయిన సిద్ధరామయ్యను రాజ్యసభ ఎంపీగా పంపించాలని హైకమాండ్ యోచించింది.

అయితే ఈ ప్రతిపాదనను సిద్ధరామయ్య తిరస్కరించడంతో, రెండోసారి ఖర్గే రాజ్యసభ ఎంపీగా గత నెలలో ఎన్నికయ్యారు. రెండు దఫాలు సొంత రాష్ట్రం కర్ణాటక నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఖర్గే అంతకుముందు 9 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు లోక్ సభ ఎంపీగా కూడా గెలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>