కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో ప్రజలు అవలంబిస్తున్న విపరీత బుద్ధులు ప్రాణాల మీదకి తీసుకొస్తున్నాయి. కొందరు సోషల్ మీడియాలో చూసి ఫాలో అవుతున్న వైద్యంతో ఏకంగా ప్రజలు ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లా పుంజైతళవాయిపాళ్యంలో చోటు చేసుకుంది. యూట్యూబ్ (YouTube)లో వీడియోలు చూసి ఇంట్లోనే ప్రసవం చేయడానికి ప్రయత్నించిన ఘటనలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే… గ్రామానికి చెందిన శశికళ అనే మహిళ గర్భవతి. ఇది ఆమెకు రెండో కాన్పు కాగా, మొదటి ప్రసవం సిజేరియన్ ద్వారా జరిగింది. అయితే ఈసారి సాధారణ ప్రసవం కావాలనే ఉద్దేశంతో పురుటి నొప్పులు వచ్చిన సమయంలో ఆమె అత్త పళని యూట్యూబ్ వీడియోల సహాయంతో ఇంట్లోనే కాన్పు చేశారు. ఈ క్రమంలో శశికళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడం మొదలైంది.
శశికళ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడటానికి మూడు రోజుల పాటు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం శశికళకు జన్మించిన శిశువు పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్త పళనిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. చదువుకున్న వారైనా సరే, వైద్య సహాయం లేకుండా ఇలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

