ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పర్యటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి 46వ డివిజన్‌లో UDIF నిధులతో 1.5 కోట్ల తో బాక్స్ టైప్ డ్రైన్ నిర్మాణానికి మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యం..

అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దాం అని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఉమ్మడి కరీంనగర్‌ను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతాం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతాం అని హామీ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 నుంచి 90 శాతం పూర్తయి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా భీమదేవరపల్లిలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదన చేశామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని, జమ్మికుంట, హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అడుగుతున్నామని తెలిపారు.

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఫార్మసీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, అసంపూర్తిగా నిలిచిపోయిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు.

సింగరేణి, ఎన్టీపీసీ, గోదావరి జలసంపదతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అభివృద్ధిలో అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఎలగందుల ఖిల్లా, ఇతర పర్యాటక ప్రాంతాలు, జలవనరుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయన్నారు.

కరీంనగర్‌లో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అర్బన్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం దాదాపు 1000 కొత్త పోస్టులకు ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కరీంనగర్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిని, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరినట్లు వివరించారు.

ప్రజలకు సంబంధించిన ఉమ్మడి సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులపై జర్నలిస్టులు కూడా సూచనలు చేస్తూ భాగస్వాములు కావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనన్ని నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజాప్రతినిధిగా జిల్లా అభివృద్ధికి పాటుపడటం తమ బాధ్యత అని, ప్రజల ఆశీర్వాదంతో ఆ బాధ్యతను నెరవేరుస్తాం అని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) స్పష్టం చేశారు.

Also Read : “పబ్లిక్ లేకుండా పబ్లిక్ హియరింగ్”.. మూసీ భూసేకరణపై కేటీఆర్ ఆగ్రహం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>