కలం, మధిర: ఖమ్మం జిల్లా మధిర (Madhira) నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) పర్యటన సందర్భంగా ఉద్రిక్తత, ఉత్సాహం ఒకేచోట చోటుచేసుకున్నాయి. మధిర మండలం దెందుకూరులో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ను స్థానిక మహిళలు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమకు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Houses) మంజూరు చేయాలని కోరుతూ దెందుకూరుకు చెందిన ఓ మహిళా ఆమె ఇద్దరు కూతుళ్లు డిప్యూటీ సీఎం కారుకు ఎదురుగా నిలబడ్డారు.
స్థానిక నాయకులు ఎంత సముదాయించినా వినకుండా వారు కారు ముందు బైఠాయించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రూరల్ సీఐ మధు అప్రమత్తమై జోక్యం చేసుకున్నారు. మహిళలను శాంతింపజేసి డిప్యూటీ సీఎం వద్దకు తీసుకువెళ్లగా… తమకు ఇల్లు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన భట్టి విక్రమార్క, వారు అర్హులో కాదో క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దెందుకూరులోని ముప్పసాని కృష్ణవేణి-రాంబాబు దంపతుల నివాసంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ప్రజలతో కలిసి బాణాసంచా కాల్చి పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

