కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. భూక్యా సోమ్లా తన వదిన విజయతో కలిసి పునుకుల గ్రామం పరిధిలోని దేవిజ్యా తండాలో ఉన్న విజయ కుమార్తె ఇంటికి పండుగ నిమిత్తం బయలుదేరారు. ఈ క్రమంలో కిన్నెరసాని వైపు నుంచి వస్తున్న మరో బైక్ వీరి వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు భూక్యా సోమ్లా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆయనతో పాటు ప్రయాణిస్తున్న విజయకు తీవ్ర గాయాలై చేయి విరిగింది. అలాగే, మరో బైక్ పై ఉన్న రంజిత్ కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విజయను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పండుగ వేళ జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

