భూ రీ సర్వేలో జాప్యం చేస్తే ఉపేక్షించబోం: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో భూముల రీ-సర్వే పనుల్లో ఎలాంటి జాప్యాన్ని, పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అధికారులను హెచ్చరించారు. అదే సమయంలో అటవీ సంపద రక్షణపై స్పష్టమైన సంకేతాలిస్తూ.. జిల్లాలో ఇకపై కొత్తగా ఎక్కడా పోడు సాగు జరగడానికి వీల్లేదని, ఒకవేళ జరిగితే కఠిన చర్యలు ఉంటాయని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీ-సర్వే పురోగతి, అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం, పోడు భూముల అంశం, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా మంత్రి (Minister Ponguleti) మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 70 గ్రామాల్లో రీ-సర్వే చేపట్టాల్సి ఉండగా, ప్రస్తుతం 14 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని, అందులో ఐదు గ్రామాల్లో పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన గ్రామాల్లో కూడా నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేసేలా తగిన కార్యాచరణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా పాల్వంచలో కొనసాగుతున్న సర్వే పనుల మందగమనంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి చాలా కాలం గడిచినా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మండిపడ్డారు. పనుల్లో జాప్యానికి గల కారణాలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, రీ-సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు సర్వేయర్లు, రోవర్ పరికరాలు, సాంకేతిక సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు.​

అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేకంగా స్పందిస్తూ, జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను పోలీస్ శాఖ ద్వారా గుర్తించి, అక్కడ ఉన్న భూ వివాదాలను సామరస్యపూర్వకంగా, చట్టబద్ధంగా ప‌రిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, దీనిపై ప్రతి నెలా సమీక్ష సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.

పోడు భూముల అంశంపై మాట్లాడుతూ, గతంలో పోడు సాగు చేసుకుంటున్న వారి సమస్యలను ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, మానవీయ కోణంలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని చెప్తూనే, కొత్తగా అక్రమ సాగుకు పాల్పడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

​అనంతరం పాల్వంచలోని శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై సమీక్షించిన మంత్రి, అక్కడ వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునేలా రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీనివాసగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ​ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో దశలవారీగా రీ-సర్వే పనులు పారదర్శకంగా కొనసాగుతున్నాయని, మిగిలిన గ్రామాల్లో నిర్దేశిత గడువులోగా సర్వే పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని వివరించారు.

మూడు శాఖల సమన్వయంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రికి తెలిపారు. ​ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: ఢిల్లీలో అఖిలపక్ష భేటీ.. విపక్ష పార్టీల వాకౌట్.. ఏమైందంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>