కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, నగరాభివృద్ధి, తాగునీటి భద్రత, రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ( Kolagani Srinivas ) ప్రత్యేక వినతిపత్రాన్ని అందజేశారు.
జిల్లా సమీక్ష సమావేశం అనంతరం మంత్రి గారిని కలిసి కరీంనగర్ నగరంతో పాటు నియోజకవర్గ ప్రజల అవసరాలను వివరించిన మేయర్, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గిపోవడంతో ఎల్‌ఎండీ జలాశయంలో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి అదనంగా 2 టీఎంసీల నీటిని విడుదల చేసి ఎల్‌ఎండీని నింపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరారు.
అమృత్ 2.0 పథకం కింద నగరంలో చేపడుతున్న తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు అత్యంత నెమ్మదిగా సాగుతున్నాయని పేర్కొంటూ, ప్రజలకు త్వరగా ప్రయోజనం చేకూరేలా పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతులకు ఫసల్ బీమా యోజన ను సమర్థవంతంగా అమలు చేయాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా కరీంనగర్ నగర అభివృద్ధి కోసం గతంలో ముఖ్యమంత్రి హామీ కింద మంజూరైన రూ.132 కోట్లలో ఇప్పటివరకు రూ.34 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, మిగిలిన రూ.98 కోట్ల నిధులు విడుదల కాకపోవడంతో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, వరద నివారణ పనులు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అభివృద్ధి పనులు నిధుల కొరత కారణంగా పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇటీవల విలీనమైన 8 గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం అదనంగా రూ.200 కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం ద్వారా కోరారు. ఈ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్లు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్య వ్యవస్థ, పార్కులు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు అవసరమని వివరించారు.
వేగంగా విస్తరిస్తున్న కరీంనగర్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించి, నగర సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కూడా మంత్రి గారిని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని సానుకూలంగా పరిశీలించి, మిగిలిన సీఎం అష్యూరెన్స్ నిధుల విడుదలతో పాటు అదనపు నిధుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు మేయర్ తెలిపారు.
కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు తాగునీటి భద్రత, రైతుల సంక్షేమం మరియు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాగేశ్వరరావు గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

