Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్రంపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం.. SIR విధానంపై విమర్శలు

కలం, ఖమ్మం బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు పాల్పడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. ఖమ్మం (Khammam) ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట క్రాస్ రోడ్డులో గల పీవీఆర్ గార్డెన్స్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) అవగాహన శిక్షణ శిబిరంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ‘SIR’ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ఒక పెద్ద భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో, తమకు ఓట్లు ఎక్కువగా ఉన్న చోట ఒక పద్ధతి ప్రకారం సుమారు 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్’ ఓట్లుగా చిత్రీకరించి జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా లేదా పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, వాటినే సాకుగా చూపి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఇదే ఫార్ములాను ప్రయోగించి విజయం సాధించిన బీజేపీ, ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని చూస్తోందని, కాంగ్రెస్ శ్రేణులు దీన్ని గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

​రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటనను ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఎంతటి దుస్థితికి దిగజారిందో దీనిని బట్టి అర్థమవుతోందని మంత్రి అన్నారు. ఆమెకు అవసరమైన ఓట్లు ఉన్నప్పటికీ, ఒక పాత ఎఫ్‌ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపి, ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్‌ను అక్రమంగా తిరస్కరింపజేశారని మండిపడ్డారు. నిన్నటి వరకు ఓట్లను దొంగిలించిన కేంద్రం, నేడు ఏకంగా ఎన్నికల సీట్లనే దొంగిలిస్తోందని ఆయన ఆరోపించారు.

అంతేకాకుండా, బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా వాడుకుంటోందని మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ఈ సంస్థల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతోందని అన్నారు.

​జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు నెల రోజుల పాటు జరిగే ‘ఓట్ మ్యాపింగ్’ ప్రక్రియపై కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను, వారు ఊర్లో లేరనే సాకుతో ఓట్లు తొలగించే అవకాశం ఉందని, కాబట్టి ముందస్తుగా చాటింపు వేయించి వారిని రప్పించి ఓటును కాపాడుకోవాలని సూచించారు. మనకు దొంగ ఓట్లు అవసరం లేదని, మనకున్న జనాదరణతో ప్రతి ఓటునూ ఒక కాంక్రీట్ గోడలా కాపాడుకోవాలని కోరారు.

రాహుల్ గాంధీకి అండగా నిలుస్తూ, ఈ అక్రమ SIR కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, పీసీసీ ప్రతినిధి సుధాకర్, ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్, ఏదులాపురం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు పలువురు స్థానిక నాయకులు, 291 బూత్‌ల బీఎల్‌ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>