కలం, ఖమ్మం బ్యూరో: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.18,000 వేతనం పెంపు హామీని వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం పాల్వంచలోని సీఆర్ భవన్‌లో గోనే మణి అధ్యక్షతన నిర్వహించిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (AITUC) భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నరాటి ప్రసాద్ మాట్లాడుతూ.. అంగన్వాడీలపై రోజురోజుకూ అదనపు పనిభారం పెరుగుతోందని, మరోవైపు వేతనాల పెంపు, ఇంటి అద్దె, భత్యం, గ్యాస్ బిల్లుల చెల్లింపులు వంటి సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్ విధుల కారణంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అందువల్ల అంగన్వాడీ సిబ్బందికి అప్పగించిన బీఎల్ఓ విధులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రీ-ప్రైమరీ పాఠశాలల పేరుతో అంగన్వాడీల ప్రాధాన్యతను తగ్గించే విధానాలను విడనాడాలని, కేంద్రాల ఉనికిని కాపాడాలని స్పష్టం చేశారు.
అలాగే, 10 సంవత్సరాల సేవ పూర్తి చేసుకుని డిగ్రీ, పీజీ అర్హతలు పొందిన అంగన్వాడీ టీచర్లకు ఐసీడీఎస్ శాఖలో గ్రేడ్–1 సూపర్వైజర్, సీడీపీఓ కార్యాలయ సిబ్బంది పోస్టులలో 30 శాతం పదోన్నతి రిజర్వేషన్ కల్పించి, ఆ పోస్టులను అంగన్వాడీ సిబ్బందితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందికి గౌరవప్రదమైన వేతనం, పదోన్నతి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు రెడ్డి అరుణ, వేల్పుల మల్లికార్జున్, అన్నారపు వెంకటేశ్వర్లు, విజయ, శ్రీలత, సావిత్రి, సుభాషిణి, వినోద, భారతి తదితరులు పాల్గొన్నారు.

