క‌రీంన‌గ‌ర్‌లో స‌ర్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి: ఎంఐఎం నేతల వినతి

కలం, కరీంనగర్ బ్యూరో: స‌ర్ (SIR) ప్ర‌క్రియ‌లో ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎంఐఎం కరీంనగర్ (Karimnagar AIMIM) అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప‌లువురు నాయ‌కులు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఉన్న స‌ర్‌-2002 ఓటర్ సెర్చ్ పోర్టల్‌లో పేరు, ఇంటి నంబర్, ఎపిక్ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ ఆధారంగా ఓటర్ల వివరాలను సులభంగా వెతికే అవకాశం ఉండేదని తెలిపారు. ప్రస్తుతం కొత్త పోర్టల్‌లో ఈ ప్రాథమిక సెర్చ్ ఆప్షన్లు తొలగించడంతో ఓటర్లు, రాజకీయ పార్టీ ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

స‌ర్‌ ప్రక్రియకు సంబంధించి ప్రజల సందేహాలను నివృత్తి చేయడానికి రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక స‌ర్‌ హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేసి, ఫిర్యాదులు, అభ్యర్థనలు, సాంకేతిక సమస్యలకు వెంటనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పాత ఓటర్ సెర్చ్ విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్నికల అధికారులకు సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జాయింట్ సెక్రెటరీ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, మాజీ కో ఆప్షన్ సభ్యులు అహ్మద్ మొహియుద్దీన్ బాబు జానీ, కంటెస్టెడ్‌ కార్పొరేటర్ అన్నెమల్ల సురేష్, ఖదీర్ శాఖాన్, రొండి అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>