కలం, వెబ్ డెస్క్: పదో తరగతి థర్డ్ లాంగ్వేజ్‌పై కొంతకాలంగా విద్యార్థుల్లో వస్తున్న అనుమానాలకు సీబీఎస్ఈ (CBSE) తెరదించింది. అన్ని తరగతుల వారికి భాషల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇవి 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. వీటి ప్రకారం, ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వారికి మూడు భాషల విధానం వర్తించబోదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏ భాషలు అనుసరిస్తున్నారో.. అవే కొనసాగుతాయి. వీటిలో ఎలాంటి మార్పు ఉండబోదు. 7, 8, 9వ తరగతుల విద్యార్థులకు మూడు భాషలు ఉంటాయి. వాటిలో రెండు కచ్చితంగా భారతీయ భాషలే ఉండాలి. పదో తరగతికి వెళ్లినప్పుడు మాత్రం మూడో భాషలో బోర్డ్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.
ఒక భారతీయ భాష నేర్చుకోవాల్సిందే..
6, 7, 8, 9వ తరగతుల్లో రెండు విదేశీ భాషలు (జర్మన్, జపనీస్ లాంటివి) తీసుకున్న విద్యార్థులు మాత్రం అదనంగా ఒక భారతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2026-27) 9వ తరగతి చదివే విద్యార్థులకు మూడో భాషలో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మాత్రమే ఉంటుంది. వీరు పదో తరగతికి వెళ్లినప్పుడు మాత్రం సీబీఎస్ఈ బోర్డు పరీక్షలో మూడో భాషకు ఎలాంటి పరీక్ష నిర్వహించరు. ఎన్సీఈఆర్టీ ఇప్పటికే 22 భాషల్లో పుస్తకాలు ముద్రణ ప్రారంభించి, పంపిణీకి చర్యలు తీసుకుంటోంది.
మరికొన్ని కీలక అంశాలు..
- విదేశాల్లోని సీబీఎస్ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులకు భారతీయ మాతృభాష తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.విదేశాల నుంచి తిరిగి భారత్ కు వచ్చిన
- విద్యార్థులకు మూడో భారతీయ భాష నుంచి మినహాయింపు ఉంటుంది.
- ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు భాషల ఎంపికలో చట్ట ప్రకారం కొంత మినహాయింపు ఉంటుంది.
- విద్యార్థులు మూడు భాషల్లో రెండు కచ్చితంగా భారతీయ భాషలే ఉండాలి. మూడోది విదేశీ భాష లేదా భారతీయ భాషను ఎంచుకోవచ్చు.

