కలం, వెబ్ డెస్క్ : ఏప్రిల్‌లో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ప్రకటించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసంపూర్తి గా ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తిచేయడమేగాక, ఖాళీగా ఉన్న ఇండ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయిస్తామని శాసనసభ సమావేశాల్లో బుధవారం సభ్యుల ప్రశ్నలకు పొంగులేటి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా త్వరలో ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను పరిష్కరించేందుకు కొద్ది రోజుల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెస్తామని, వీటి ద్వారా వచ్చే ప్రశ్నలకు 24 గంటల్లోగా సమాధానం చెప్పడమేగాక వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పొంగులేటి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మూడు విభాగాలుగా సమస్యలను విభజించి పరిష్కరించడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 21లక్షల ఇండ్లు నిర్మించారని గుర్తు చేశారు. మళ్లీ ఈ పేదల ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సాగుతోందన్నారు. గత ప్రభుత్వం రెండు లక్షల పైచిలుకు ఇండ్లను మంజూరు చేసి హైదరాబాద్ ప్రాంతానికి కేటాయించిన లక్ష ఇండ్లలో 78,861 ఇండ్లు పూర్తయినా మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని, 21,838 ఇండ్లు కేవలం పునాదులకే పరిమితమయ్యాయని ఆరోపించారు.
జిహెచ్ఎంసీ పరిధిలో 26 కాలనీలు అసంపూర్తిగా ఉండిపోయాయని, తాము కొత్తగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు చేశామన్నారు. తాము ఎటువంటి భేషజాలకు పోకుండా గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 92వేల ఇళ్లలో 62వేల ఇళ్లు పూర్తి చేశామని వివరించారు. 2023 ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం 23,500 ఇండ్లను కేటాయించిందని అయితే నగరంలో వృత్తి వ్యాపారాలు చేసుకునే వారు సమారు 20-30 కిలోమీటర్ల దూరంలో కేటాయించిన ఇండ్లలోకి రాలేదని ఫలితంగా 12వేలకు పైగా ఇండ్లు ఖాళీగా ఉండిపోయాయని వివరించారు. దీనిపై ఉన్నతాధికారులు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో మూడు సార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని వివరించారు. లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పిస్తూ రెండు నెలల్లోగా వీటిలో గృహప్రవేశాలు చేయాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఒకవేళ వారు రాలేకపోతే సుమారు 5-10 కిలోమీటర్ల పరిధిలో ఉండే అర్హులైన పేదలకు కేటాయించనున్నట్లు పొంగులేటి తెలిపారు.
జర్నలిస్టుల కాలనీలకు మౌలిక సదుపాయాలు : పొంగులేటి
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొత్త కేటాయింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల కాలనీలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 99 రోజలు ప్రణాళికా కార్యక్రమంలో లబ్దిదారుల ఎంపిక పూర్తిచేస్తామని , గతంలో నిర్మాణాలు చేపట్టి ఆపివేసిన లబ్దిదారులకు మిగిలిన నిర్మాణాలకు గాను నిధులు విడుదల చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించేలా పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో మార్చి 31 నాటికి సుమారు లక్షా 12వేల ఇందిరమ్మ ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలు జరుగనున్నాయని, వచ్చే జూన్ నాటికి మరో లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. గతంలో గృహలక్ష్మి పధకం కింద ప్రారంభించి అసంపూర్తిగా ఆగిపోయిన ఇండ్లకు నిధులు ఇస్తామని దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవలసి ఉందని తెలిపారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి గాను ఇప్పటికే 14-15 స్దలాలను గుర్తించామని, ఆయా ప్రాంతాలలోని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని, రాష్ట్రంలోని ఇతర ముఖ్యపట్టణాలలో కూడా ఇదే పద్దతిని అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

