Mobile Popup Ad
Mobile Popup Ad

భారీ వర్షాలొచ్చినా.. సీఎం సభ సక్సెస్ ఖాయం: మంత్రి పొంగులేటి

​కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30వ తేదీన ‘రైతు ఆశీర్వాద సభ’ నిర్వహించనన్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను మంత్రి నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలను తట్టుకునేలా జర్మన్‌ హ్యాంగర్లతో అద్భుతమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మట్టా రాగమయి దయానంద్‌, రాందాస్ నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాహసోపేత నిర్ణయాలతో అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అక్షరాలా నిలబెట్టుకుంటూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని కొనియాడారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ మానవీయ కోణంలో ఆలోచించి, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. కేవలం కొనడమే కాకుండా, కొన్న వారం రోజుల లోపలే రైతుల అకౌంట్లలో పైసలు వేసిన నిఖార్సైన రైతు పక్షపాత ప్రభుత్వం ఇదని ఆయన కొనియాడారు. ​గత పదేళ్ల పాలకుల తీరుపై మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

ప్రజలు తమ వైపు చూడటం లేదనే తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లోనే కేంద్ర, రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్నవాళ్లు నేడు ఈ ప్రభుత్వంపై అనవసరంగా అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఇదే ఖమ్మం పట్టణంలో గతంలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు, రైతుల కష్టాలు పట్టించుకోకుండా, నడిరోడ్డుపై అన్నదాతలకు సంకెళ్లు వేసి జైలుకు పంపించిన దుర్మార్గాన్ని ఈ జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని గుర్తుచేశారు. నాడు రైతులను విస్మరించి, హింసించిన వాళ్లే నేడు ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఆరోపించారు. ఈ రాజకీయ డ్రామాలను రైతులందరూ గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. జిల్లా సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని ఈ సభను ఒక చారిత్రాత్మక విజయంగా మలుస్తామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>