కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో పేదల విద్యతో పాటు వైద్య రంగానికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ప్రభుత్వం నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి (100-Bed Hospital) పనులను కలెక్టర్ దివాకర్ టి.ఎస్.తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ప్రతిచోటా 100 బెడ్ల ఆసుపత్రులతో పాటు అవసరమైన మౌలిక వసతులు, డాక్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
కేవలం పట్టణ ప్రాంతాలకే కాకుండా, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో కూడా వైద్య రంగానికి కావలసిన ఇన్‌ఫ్రాని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో సమకూరుస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఒకవేళ పేదవారు ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవాల్సి వస్తే, ‘సీఎం రిలీఫ్ ఫండ్’ ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తూ వారికి పూర్తి భరోసానిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

