కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా రామడుగు మండలంలో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను సీపీఐ నాయకుల బృందం మంగళవారం పరిశీలించింది. క్షేత్రస్థాయిలో ఎండిన వరి చేన్లను పరిశీలించి, తీవ్రంగా నష్టపోయిన రైతుల బాధలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కరువును తక్షణమే ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పత్రికా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. కరువు బారిన పడి విలవిలలాడుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచి, రాష్ట్రానికి రావాల్సిన కరువు సహాయాన్ని వెంటనే సాధించాలని డిమాండ్ చేశారు.
ఎకరానికి రూ. 30 వేలు నష్టపరిహారం
నీరు అందక పూర్తి స్థాయిలో ఎండిపోయిన వరి పంటకు ఎకరానికి కనీసం రూ. 30 వేల చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేయాలని కోరారు. కరువు మూలంగా ఉపాధి కోల్పోయిన పేద ప్రజలకు ప్రత్యేకంగా ‘కరువు పెన్షన్లు’ మంజూరు చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, మండల నాయకులు, స్థానిక నాయకులు, బాధిత రైతులు పాల్గొన్నారు.

