epaper
Wednesday, February 18, 2026
epaper

ధ‌ర‌ణి దోపిడీపై పొంగులేటి ఉక్కుపాదం.. అధికారులకు కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti) అన్నారు. ప్రజ‌ల ఆస్తుల ర‌క్షణ‌కు నిర్మించాల్సిన వ్యవస్థనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు నేతలు త‌మ స్వార్థ ప్రయోజ‌నాల కోసం వాడుకున్నార‌ని పొంగులేటి మండిప‌డ్డారు. ధ‌ర‌ణి పోర్టల్‌లోని లొసుగుల‌పై ఉన్నత స్థాయి క‌మిటీతో విచార‌ణ జ‌రిపించ‌గా, అనేక ఆశ్చర్యకరమైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయ‌న్నారు. ఇది సాధార‌ణ సాంకేతిక లోపం కాద‌ని, వ్యవ‌స్థపరంగా సృష్టించిన లోపాలు అని అన్నారు. బుధ‌వారం స‌చివాల‌యంలోని ఉన్నత‌స్థాయి క‌మిటీతో కీలక స‌మీక్ష నిర్వహించారు.

ఆనాడు ధ‌ర‌ణి పోర్టల్ (Dharani Portal)  సెక్యూరిటీ ఆడిట్ చేసిన స‌మ‌యంలో గుర్తించిన లోపాల‌ను స‌రిదిద్దకుండానే అంతా స‌వ్యంగానే ఉన్నట్లుగా నివేదిక ఇచ్చార‌ని పొంగులేటి స్పష్టం చేశారు. వ్యక్తుల ప్రమేయంతో త‌ప్పులు చేసేవిధంగా పోర్టల్‌‌ను రూపొందించార‌ని, భూముల లావాదేవీల‌కు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న భూముల స‌మాచారం ల‌భించ‌కుండా లాగిన్‌లు డిలిట్ చేశార‌న్నారు. ర‌హ‌స్యంగా ఉండాల్సిన లాగిన్ వివ‌రాలు లేకుండా పోయాయ‌ని మంత్రి ఆరోపించారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రిగిన భూలావాదేవీల స‌మాచారం ల‌భించ‌కుండా చేశారని, ఫోరెన్సిక్ ఆడిట్‌లో కోడ్ ఆడిట్ నిర్వహించ‌లేద‌న్న విష‌యం బ‌హిర్గత‌మైందన్నారు. త‌క్షణ‌మే ధ‌ర‌ణి పోర్టల్‌పై కోడ్ ఆడిట్ నిర్వహించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పోర్టల్ బాధ్యతను టెర్రాసిస్ అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లే స‌మ‌స్యలు ఎదుర‌వుతున్నాయ‌ని మంత్రి తేల్చి చెప్పారు.

ధ‌ర‌ణి లోపాల‌ను అడ్డుపెట్టుకొని స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను కొల్లగొట్టినవారిని క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తామ‌ని, త‌ప్పుచేసిన‌వారు ఎవ‌రినైనా వ‌దిలిపెట్టే ప్రస‌క్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతిపైసాను వ‌సూలు చేస్తామ‌న్నారు. భ‌విష్యత్తులో మళ్లీ తప్పులు జ‌ర‌గ‌కుండా భూభార‌తి పోర్టల్‌ను (Bhu Bharati) నిర్వహించాల‌ని అధికారుల‌కు సూచించారు. ప్రజ‌ల భూముల విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌బోమన్నారు. ధ‌ర‌ణి పేరుతో జ‌రిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తాన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ‌కు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను మంత్రి పొంగులేటి (Minister Ponguleti) ఆదేశించారు.

 Read Also: తెలంగాణలోనే ఈవీల తయారీ: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>