విద్య, ఆరోగ్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ఆపిందో చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) ప్రతి పక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఖమ్మం (Khammam) లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం 27 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇండ్ల పేరుతో పేదలను మోసం చేసిందని, అయితే తమ ప్రభుత్వం తొలి దశలోనే సుమారు 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలో రెండో దశ ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు అందజేస్తామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పిస్తామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ చేయలేదని తెలిపారు. ప్రజలు ప్రతిపక్షాల నిరాధార ఆరోపణలను గమనిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాలకు తగిన సమాధానం ఇచ్చి తమ ప్రభుత్వానికి మద్దతు తెలిపారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో పేదల గడప వద్దకే పథకాలను చేరవేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ప్రారంభించిన మంచి పథకాలను నిలిపివేయకుండా కొనసాగిస్తున్నామని ఆయన (Minister Ponguleti) తెలిపారు. అదనంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.2 లక్షల రుణమాఫీ, రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి పంటకు రూ.6 వేల రైతు భరోసా, సన్న బియ్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఆపద సమయంలో పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని, పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు 20 నుంచి 25 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థులు చదివే విధంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అనిత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ (RDO) శ్రీనివాస్, అర్బన్ తహశీల్దార్ జయచందర్, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: బదిలీలకు దూరంగా లక్ష మంది

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>