Mobile Popup Ad
Mobile Popup Ad

నిరుద్యోగులకు త్వరలో మరిన్ని ‘శుభవార్తలు’ : మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలోనే మరిన్ని తీపి కబుర్లు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. గురువారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ క్లస్టర్-1 సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తమది ‘సోల్లు’ చెప్పే ప్రభుత్వం కాదని, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే చేతల ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. ​నిరుద్యోగ భృతి పేరుతో గత ప్రభుత్వం కాలక్షేపం చేసిందని విమర్శిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలోనే 73 వేల ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని మంత్రి గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి, అర్హులైన ప్రతి నిరుద్యోగికి న్యాయం చేస్తామని ఆయన (Minister Ponguleti Srinivas Reddy) భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ప్రతి పక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. “పదేళ్ల అధికార దాహంలో పేదవాడిని విస్మరించి, నాడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వారు.. నేడు రంగు రంగుల అవతారాలతో ప్రజల ముందుకు వస్తే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు” అని మండిపడ్డారు. నాడు సంకెళ్లతో రైతులను భయపెట్టిన ‘దొరవారు’.. నేడు కుండలకు పూతలు పూస్తూ, దోసెల్లో మొక్కలు పట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

గతంలో అధికారులు ఏనాడూ పేదల వద్దకు రాలేదని, కానీ నేడు ప్రజా ప్రభుత్వం నేరుగా ప్రజల గడప వద్దకే వచ్చి అప్లికేషన్లు తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే ​గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేవలం కాగితాలకే పరిమితం చేసిందని, కానీ తమ ప్రభుత్వం ఒక్క రూపాయి అవినీతి లేకుండా రు.5 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రోడ్ల వెంట విషం కక్కుతున్నాయని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఈ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్,15 వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>