కలం, ఖమ్మం బ్యూరో: మత సామరస్యమే ప్రజా ప్రభుత్వ విధానమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. కూసుమంచి మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం (గణపేశ్వరాలయం) పునర్నిర్మాణ,అభివృద్ధి పనులకు రూ.3 కోట్ల 30 లక్షల 50 వేల వ్యయంతో ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ లతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు దేవుళ్లు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని, అయితే ప్రజా ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా పనిచేస్తోందన్నారు. ప్రతి మతం ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అవసరమైన సహకారం అందిస్తున్నామన్నారు. ఇటీవల సమ్మక్క- సారలమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.
గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం అభివృద్ధి పనులు పూర్తి
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మంత్రి వెల్లడించారు . గత ప్రభుత్వం భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి 350 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారని, మరో వారం నుంచి పది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భద్రాచలం ఆలయ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ కోసం ఇప్పటికే 68 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు.
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి ప్రాంతాలు అన్ని దేవాలయాలు అభివృద్ధికి మొత్తం వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగానే గణపేశ్వరాలయం అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల అభివృద్ధికి కూడా ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, డీఈ, ఏఈలు, డీపీఓ రాంబాబు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సర్పంచులు, అర్చకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

