కలం, ఖమ్మం బ్యూరో: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసికందు పాలిట శాపంగా మారింది. పుట్టిన 18 రోజులకే ఆ చిన్నారి తన ఎడమ చేతిని కోల్పోవాల్సిన దారుణ ఘటన ఖమ్మం (Khammam ) ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లాలోని వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన రేణుక, సత్యకాంత్ దంపతులకు మార్చి 3వ తేదీన కవల పిల్లలు జన్మించారు. అయితే, వారిలో ఒక మగశిశువు బరువు తక్కువగా, బలహీనంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఏంసీహెచ్ ఆసుపత్రిలోని ఇంక్యుబేటర్‌లో చేర్పించారు. అక్కడ బాబుకు రక్తం, మందులు ఎక్కించే క్రమంలో అక్కడి వైద్య సిబ్బంది ఎడమ చేతికి కాన్యులాను సరిగ్గా అమర్చలేదు. దీనివల్ల మందులు నరాల్లోకి వెళ్లకుండా పక్కనే ఉన్న కణజాలాల్లోకి చేరాయి.
ఫలితంగా బాబు ఎడమ చేయి పూర్తిగా వాచిపోయి, సెప్టిక్ అయింది. చేయి రంగు మారుతున్నా, పరిస్థితి విషమిస్తున్నా అక్కడి వైద్యులు, నర్సులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోవడంతో, బాబును అత్యవసరంగా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇన్ఫెక్షన్ శరీరం అంతటా పాకి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉండడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టిన 18 రోజులకే ఆ పసికందు ఎడమ చేతిని మోచేతి వరకు వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఆసుపత్రి సిబ్బంది కాన్యులా సరిగ్గా పెట్టకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ వచ్చిందని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో పరీక్షలు చేయించిన అనంతరం తల్లి రేణుక కన్నీరుమున్నీరయ్యారు.
అంతటితో ఆగకుండా, ఇన్ఫెక్షన్ ప్రభావంతో బాబు మెదడులో నీరు చేరిందని, భవిష్యత్తులో బాబు మానసిక వికలాంగుడయ్యే ప్రమాదం ఉందని హైదరాబాద్ వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. కేవలం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసికందు చేతిని కోల్పోవాల్సి వచ్చిందని గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని వస్తే పేదల జీవితాలతో ఆడుకుంటారా అని మండిపడ్డాయి. ఈ ఘటనకు కారణమైన డ్యూటీ డాక్టర్, నర్సులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధితులకు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

