కలం, ఖమ్మం బ్యూరో: ప్రతి పేదవాడికి వైద్యానికి, విద్యకు ఎటువంటి లోటు రాకూడదని, ధనికులకు అందుతున్న విద్య, వైద్యమే పేదలకు అందాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. బుధవారం సత్తుపల్లిలో వైద్య విధాన పరిషత్ 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించక పోయినా పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, గత పాలకులకు చిత్తశుద్ధి లేక పేదలు వైద్యం కోసం అనేక అవస్థలు పడ్డారని మంత్రి గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 48 గంటల వ్యవధిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నూతన ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలను కాగితాలకే పరిమితం చేస్తే తాము వాటిని వేగవంతంగా పూర్తి చేసి పేదలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.
రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని, కల్లూరులో 50 పడకలు, పెనుబల్లిలో 30 పడకలు, సత్తుపల్లి లో 100 పడకల ఆసుపత్రులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. వైద్య శాఖలో వెంటనే అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రూ.200 కోట్లు ఖర్చు చేస్తూ దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో 2,500 మంది వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు జారీ , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.
గత పాలకులు కమీషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు తప్ప పేదలకు ఇండ్లు కట్టలేదని మంత్రి విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, త్వరలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన చివరి లబ్ధిదారుడి వరకు రాజకీయాలకతీతంగా తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లను తమ ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. సత్తుపల్లి, అశ్వారావు పేట, సమీపంలోని ప్రాంత ప్రజలకు ఇక్కడి 100 పడకల ఏరియా ఆసుపత్రి ఉపయోగ పడుతుందన్నారు. సత్తుపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, కార్పొరేట్ కు దీటుగా అనేక సేవలు అందిస్తామన్నారు. మంత్రి ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యుల భర్తీ పూర్తి చేసి ఖాళీ లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. ఒకే రోజు 3 ఆసుపత్రులను సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు నిధులు కేటాయించి నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తే, ప్రజా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధునాతన వసతులతో ఆసుపత్రులను పూర్తి చేసి ప్రారంభించిందన్నారు. విద్యా, వైద్య రంగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నారన్నారు. గతంలో డయాలసిస్ 5 పడకలు మాత్రమే ఉండేవని నేడు వాటిని 10 పడకలకు పెంచడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సత్తుపల్లి ఆసుపత్రిలోని వైద్యుల ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, స్పెషలిస్ట్ వైద్యులు కూడా సత్తుపల్లి ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారని, అత్యవసర చికిత్సలు ఇకనుంచి సత్తుపల్లి నుంచే అందుబాటులో ఉంటాయని, ఈ ఆసుపత్రి ప్రారంభించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

